Oily Skin Tips |
చాలా మందికి బయట ఎక్కువగా తిరగడం వల్ల ముఖంపై జిడ్డు, మురికి ఏర్పడుతుంటాయి. అయితే కొందరికి ఎల్లప్పుడూ జిడ్డు ముఖమే ఉంటుంది. దీంతో మొటిమలు, మచ్చల వంటి ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను పాటిస్తే ముఖంపై ఏర్పడే జిడ్డు, మురికిలను తొలగించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. కలబంద గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
2. కలబంద ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకులను పేస్ట్ చేసి కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే జిడ్డు, మురికి తొలగిపోతాయి.
3. ఒక పాత్రలో ఒక టీస్పూన్ కలబంద గుజ్జు, అర టీస్పూన్ పెరుగు, అర టీస్పూన్ కీరదోస రసం, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మీద మురికి పోవడమే కాకుండా అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి.
4. ఒక పాత్రలో రెండు టీస్పూన్ల కలబంద గుజ్జు, ఒక టీస్పూన్ ఓట్స్, ఒక టీస్పూన్ కీరదోస తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వలయాకారంలో మసాజ్ చేయాలి. అనంతరం కొంత సేపు ఆగాక కడిగేయాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు, మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.