Breaking News
Loading...

Info Post

andariki-ayurvedam-dengue-sympotms

డెంగీ... ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర ఎక్క‌డ చూసినా దీని బారిన ప‌డి చాలా మంది హాస్పిట‌ల్స్‌కు ప‌రుగులు పెడుతున్నారు. కొంద‌రు జ్వ‌రం రాగానే రక్త ప‌రీక్ష‌లు చేయించుకుని డెంగీ అని తేలితే వెంట‌నే చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇంకొంద‌రిలో మాత్రం వ్యాధి వ‌చ్చిన 5, 6 రోజుల వ‌ర‌కు గానీ జ్వ‌రం, ఇత‌ర ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో అలాంటి వారిలో కొంద‌రు ప్లేట్‌లెట్ల‌ను బాగా కోల్పోతుండ‌డంతో వారు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. కొన్ని చోట్ల డెంగీతో మృతి చెందిన‌వారి వార్త‌ల‌ను కూడా వింటున్నాం. క‌నుక ఏ చిన్న అనారోగ్య సూచ‌న, ల‌క్ష‌ణం క‌నిపించినా అశ్ర‌ద్ధ చేయ‌కుండా వెంట‌నే త‌గిన జాగ్ర‌త్త తీసుకుని వైద్యుని వ‌ద్ద‌కు వెళ్ల‌డం ఉత్త‌మం. ఈ క్ర‌మంలో అస‌లు డెంగీ ఎలా వ‌స్తుంది, దాని దోమ‌లు ఎలా ఉంటాయి, అవి ఎక్క‌డ‌, ఎలా పెరుగుతాయి, డెంగీ వ‌చ్చాక క‌నిపించే ల‌క్ష‌ణాలు, ఆ వ్యాధి ప‌ట్ల మ‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను గురించి ఇప్పుడు మ‌నం వివ‌రంగా తెలుసుకుందాం. 

నాలుగు ర‌కాల వైర‌స్‌ల‌తో డెంగీ వ్యాప్తి...
డీఈఎన్‌వీ 1,2,3,4 అనే నాలుగు ర‌కాల వైర‌స్‌ల వ‌ల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ వైర‌స్ ఉన్న వ్య‌క్తిని AEDES అనే పేరున్న దోమ కుడితే అప్పుడు ఆ వైర‌స్ స‌ద‌రు దోమ‌లోకి ప్ర‌వేశిస్తుంది. కానీ వారం రోజుల వ‌ర‌కు ఆ దోమ‌లో వైర‌స్ ప్ర‌భావం ఉండ‌దు. అనంత‌రం వైర‌స్ వృద్ధి చెందుతుంది. అప్పుడు ఆ వైర‌స్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన‌ దోమ‌లు మ‌ళ్లీ ఎవ‌రినైనా కుడితే వారికి డెంగీ వ‌స్తుంది. 

andariki-ayurvedam-dengue-source


నీరు ఎక్కువ‌గా నిల్వ ఉన్న చోటే...
ఈ AEDES దోమ‌లు నీరు ఎక్కువ‌గా ఉన్న‌చోటే గుడ్ల‌ను పెట్టి త‌మ సంతానాన్ని వృద్ధి చెందిస్తాయి. వీటిలో కేవ‌లం ఆడ‌దోమ‌లు మాత్ర‌మే మ‌న‌ల్ని కుడ‌తాయి. ఎందుకంటే వాటికి గుడ్లు త‌యారు అయ్యేందుకు త‌గిన ప్రోటీన్ అవ‌స‌రం. అందుకు అవి మ‌నిషి ర‌క్తం మీద ఆధార ప‌డ‌తాయి. అందుకే మ‌నల్ని అవి కుడ‌తాయి. అలా మ‌న‌ల్ని కుట్టి పీల్చిన ర‌క్తంతో AEDES ఆడ‌దోమ‌లు గుడ్ల‌ను ఉత్ప‌న్నం చేసి నీరు ఎక్కువ‌గా నిల్వ ఉన్న చోట వాటిని పెడ‌తాయి. ఆ నీటిలో ఉన్న గుడ్లు 8 రోజుల త‌రువాత పిల్ల‌లుగా మారుతాయి. అయితే AEDES దోమ‌ల గుడ్లు ఎంత‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌నైనా త‌ట్టుకుని కొన్ని నెల‌ల పాటు అలాగే ఉంటాయి. మ‌ళ్లీ నీరు వాటి వ‌ద్ద‌కు రాగానే అప్పుడ‌వి పిల్ల‌లుగా మారుతాయి. అందుకే వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ఇవి ఉత్ప‌న్నం అవుతాయి. ఆ స‌మ‌యంలోనే రోగాల‌ను వ్యాప్తి చెందిస్తాయి. 

సైలెంట్‌గా వ‌చ్చి కుట్టే టైగ‌ర్ దోమ‌లు...
AEDES జాతికి చెందిన ఆడ‌దోమ‌లు సైలెంట్‌గా వ‌చ్చి కుడ‌తాయి. వీటిని టైగ‌ర్ దోమ‌ల‌ని కూడా పిలుస్తారు. ఈ దోమ‌ల జీవితం కాలం దాదాపుగా 2 వారాలు. ఆ స‌మ‌యంలోనే ఒక్కో దోమ 3 సార్లు 100 గుడ్ల చొప్పున పెడుతుంది. అలా పెట్ట‌బ‌డిన గుడ్లు పిల్ల‌లుగా మారుతాయి. వాటిలోనూ డెంగీ వైర‌స్ ఉంటుంది. ఆ వైర‌స్ వాటిలో వాటి జీవిత కాలం వ‌ర‌కు అలాగే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆ దోమ‌లు కూడా గుడ్లు పెట్టి మ‌ళ్లీ పిల్ల‌ల్ని ఉత్ప‌త్తి చేస్తే వాటిలోనూ డెంగీ ఉంటుంది. అలా ఆ వైర‌స్ వాటిలో ఎప్ప‌టికీ నిరంత‌రాయంగా తిరుగుతూనే ఉంటుంది. 

డెంగీ దోమ‌లు ప‌గ‌లే ఎక్కువ‌గా కుడ‌తాయి...
తెల్ల‌వారు జామున సూర్యోద‌యం జ‌రిగేట‌ప్పుడు, సాయంత్రం సూర్యుడు అస్త‌మించేట‌ప్పుడు దాదాపు 2 గంట‌ల స‌మ‌యం పాటు ఈ దోమలు ఎక్కువ‌గా దాడి చేస్తాయి. ప‌గ‌టి పూట కూడా ఇవి కుడ‌తాయి. అన్ని దోమ‌ల్లా కాకుండా డెంగీ దోమ‌లు మ‌న శ‌రీరం కింది భాగంలో ఎక్కువ‌గా కుడ‌తాయి. ఈ దోమ‌లు తాము ఉన్న ప్ర‌దేశాల నుంచి సుమారు 400 మీట‌ర్ల దూరం వ‌ర‌కు మాత్ర‌మే వెళ్తాయి. అందుకే ఆ ప‌రిధిలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను త‌ర‌చూ శుభ్రం చేసుకోవాలి. ఈ దోమ‌లు చీక‌టి ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటాయి. దుస్తుల‌ను త‌గిలించే హ్యాంగ‌ర్ల వెనుక‌, క‌ప్‌బోర్డులు, మంచాల కింద‌, క‌ర్టెన్ల ద‌గ్గ‌ర ఈ దోమ‌లు ఉండేందుకు అవ‌కాశం ఉంది. కేవ‌లం ఒక‌టి రెండు డెంగీ దోమ‌లు ప‌రిస‌రాల్లో ఉన్నా పెద్ద ఎత్తున డెంగీ విష జ్వ‌రాల‌ను ప్ర‌బ‌లించేందుకు ఆస్కారం ఉంటుంది. 

andariki-ayurvedam-dengue-mosquito


శ‌రీరం, కాళ్ల‌పై గీత‌ల‌తో...
AEDES జాతికి చెందిన దోమ‌లకు శ‌రీరం, కాళ్ల‌పై తెల్ల‌ని గీత‌లు ఉంటాయి. అయితే ఇదే జాతిలో AEDES AEGYPTI అనే మ‌రో దోమ కూడా ఉంది. ఇది కూడా చూసేందుకు AEDES దోమ‌లాగే ఉంటుంది. కానీ ఈ దోమ కుడితే మాత్రం డెంగీ, చికున్‌గున్యా రెండూ ఒకేసారి వ‌స్తాయి. అధిక శాతం మందిలో డెంగీ దోమ కుట్టిన త‌రువాత 5 నుంచి 6 రోజుల‌కు దాని ల‌క్ష‌ణాలు క‌నిపించి జ్వ‌రం వ‌స్తుంది. కానీ కొంద‌రిలో మాత్రం డెంగీ ల‌క్ష‌ణాలేవీ క‌న‌బ‌డ‌వు. అయినా వారు యాక్టివ్‌గానే ఉంటారు. అయితే వారిలోనూ ఒక్కోసారి కొన్నికొన్ని అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. క‌నుక వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం అవ‌స‌రం. 

డెంగీ ల‌క్ష‌ణాలు...
తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, కంటి వెనుక భాగాల్లో నొప్పులు, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై దుర‌ద‌లు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, తీవ్ర‌మైన జ్వ‌రం, వాంతులు, క‌డుపులో నొప్పి, వికారంగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు డెంగీలో క‌నిపిస్తాయి. అయితే ఇవే ల‌క్ష‌ణాలు అంద‌రిలో ఉండ‌క‌పోవ‌చ్చు కూడా. కొన్ని ల‌క్ష‌ణాలు లేకుండా కూడా డెంగీ ఉంటుంది. వీటిలో ఏ ల‌క్ష‌ణం కనిపించినా వెంట‌నే త‌గిన జాగ్ర‌త్త తీసుకోవ‌డం ఆవ‌శ్య‌కం. 

ప్లేట్‌లెట్లు కీల‌కం...
డెంగీ వ‌చ్చిన రోగుల్లో వైద్యులు రోజూ ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను ప‌రిశీలిస్తారు. సాధార‌ణంగా జ్వ‌రంతోపాటు ఇత‌ర ల‌క్ష‌ణాలు కూడా ఉంటే ప్లేట్‌లెట్ల సంఖ్య రోజూ త‌గ్గిపోతూనే ఉంటుంది. అదే అనారోగ్య లక్ష‌ణాలు క్ర‌మంగా త‌గ్గుతుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో చాలా మంది డెంగీ పేషెంట్ల‌లో రోజుకు 10వేల నుంచి 30వేల వ‌ర‌కు ప్లేట్‌లెట్లు త‌గ్గుతుంటాయి. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులకు ఒక మైక్రో లీట‌ర్ ర‌క్తానికి గాను 1.50 ల‌క్ష‌ల నుంచి 4.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్లేట్‌లెట్లు ఉండాలి. స‌హ‌జంగా ఇవి అంద‌రిలోనూ 2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటాయి. కానీ డెంగీ వ‌చ్చాక రోజుకు 30వేల వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. రోగ నిరోధ‌క శక్తి బాగా త‌క్కువ‌గా ఉన్న వారిలో, చిన్నారుల్లో, వృధ్దుల్లో ప్లేట్‌లెట్లు ఇంకా వేగంగా ప‌డిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ప్లేట్‌లెట్ కౌంట్ 20వేల వ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కు వారికి బ‌య‌టి నుంచి ప్లేట్‌లెట్ల‌ను ఎక్కించాల్సిన అవ‌స‌రం లేదు. అంత‌కు త‌గ్గితేనే ప్లేట్‌లెట్ల‌ను ఎక్కించాల్సి ఉంటుంది. అయితే కొంద‌రిలో ప్లేట్‌లెట్ల 20వేల వ‌ర‌కు రాకున్నా వారికి ఉన్న అనారోగ్య ల‌క్ష‌ణాల తీవ్ర‌త‌ను బ‌ట్టి ప్లేట్‌లెట్ల‌ను ఎక్కించాల్సి వ‌స్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు...

డెంగీ రాకుండా ఉండేందుకు గాను మనం కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. అవేంటంటే... 

1. శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పే దుస్తుల‌ను ధ‌రించాలి. దీని వ‌ల్ల దోమ‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. డెంగీ దోమ‌లు ఎక్కువ‌గా శ‌రీరం కింది భాగంలో కుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి, ఆ భాగానికి ఇంకా ఎక్కువగా ర‌క్ష‌ణ క‌ల్పించాలి. 

2. డెంగీ దోమ‌లు ప‌గ‌టి పూట ఎక్కువ‌గా కుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది క‌నుక‌, ప‌గ‌లు కూడా మ‌స్కిటో రీపెల్లెంట్‌లు, దోమ‌ల కాయిల్స్‌, దోమ తెర‌లు వంటి వాటిని వాడాలి. 

3. ప్ర‌ధానంగా చిన్నారులు, వృద్ధులు డెంగీ ప‌ట్ల ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం అవ‌స‌రం. 

4. కిటికీలు, వెంటిలేట‌ర్లు తదిరాల‌కు మ‌స్కిటో నెట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 

డెంగీ వ‌చ్చిన‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. 

1. డెంగీ నుంచి పూర్తిగా కోలుకునేంత వ‌ర‌కు రోగుల‌కు పూర్తి బెడ్ రెస్ట్ అవ‌స‌రం. 

2. త‌డిగుడ్డ పెట్టి ఒళ్లంతా తుడ‌వ‌డం, నుదుటిపై పెట్ట‌డం వంటి ప‌నులు చేస్తే జ్వ‌ర తీవ్ర‌త త‌గ్గుతుంది. 

3. ఆస్పిరిన్‌, బ్రూఫిన్ వంటి మాత్ర‌ల‌ను వాడ‌కూడ‌దు. ఇవి గ్యాస్‌, క‌డుపులో నొప్పి, వాంతులు వంటి అనారోగ్యాల‌ను కలిగిస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను కూడా త‌గ్గిస్తాయి. 

4. పారాసిట‌మాల్ సిరప్ గానీ, మాత్ర‌లు ఇవ్వ‌డం వ‌ల్ల జ్వరాన్ని అదుపులోకి తీసుకురావ‌చ్చు. చిన్న పిల్లలకైతే ప్రతి ఆరు గంటల కోసారి ఇవ్వాలి.

5. ఓఆర్ఎస్ లేదా సెలైన్ల ద్వారా ఎల‌క్ట్రోలైట్ల‌ను శ‌రీరంలోకి ఎక్కించాల్సి ఉంటుంది. 

6. వీలైనంత వ‌ర‌కు ద్ర‌వాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, పండ్లు ఎక్కువ‌గా తినాలి. కొబ్బరి నీళ్లు, బత్తాయి రసం వంటి వాటిని ఎంత ఎక్కవగా ఇస్తే అంత మంచింది. త్వరగా జీర్ణమయి శరీరానికి సత్తువనిస్తాయి. 

7. దానిమ్మ‌, కివీ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తినాలి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతాయి. 

8. డెంగీ నుంచి కోలుకున్నాక క‌నీసం నెల రోజుల వ‌ర‌కు శాఖాహారం తీసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే జ్వ‌రం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. 

సాధార‌ణంగా డెంగీ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం ప్రారంభం అయినాక దాని తీవ్ర‌త 7 రోజుల వ‌ర‌కు ఉంటుంది. కొద్ది మందిలో ఇంకా ఎక్కువ రోజులే ఉండ‌వ‌చ్చు. అయితే ఆ స‌మ‌యంలో స్పందించి త‌గు చికిత్స తీసుకుని, జాగ్ర‌త్త‌లు పాటిస్తే డెంగీ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో 3 నుంచి 5 రోజుల క‌న్నా ఎక్కువ‌గా జ్వరంతో బాధ‌ప‌డుతూ ఉండి, హాస్పిట‌ల్‌కు వెళ్ల‌క‌పోతే ప్లేట్‌లెట్లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక జ్వ‌రం అనిపించ‌గానే వైద్య చికిత్స తీసుకోవ‌డం మంచిది. దీని ప‌ట్ల నిర్ల‌క్ష్యం అస్స‌లు వ‌హించ‌కూడ‌దు.

0 comments:

Post a Comment