నాకు 41 ఏళ్లు. పెళ్లయి పన్నెండేళ్లయింది. నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గానే వస్తాయి. అయితే పెళ్లయినప్పటి నుంచి పీరియడ్స్ రావడానికి మూడు నాలుగు రోజుల ముందు ఒకట్రెండు చుక్కలు కనిపిస్తోంది. ప్రతి నెల ఇలాగే అవుతోంది. ఎవరిని అడిగినా ఏం పరవాలేదు అంటున్నారే గాని, అసలు సమస్య ఏంటో చెప్పడం లేదు. నాకు మాత్రం ఇప్పటికీ ఈ సమస్య అలాగే ఉంది. దీని వెనుక కారణం ఏమిటో మీరైనా చెప్పండి.
- వనజ, బెంగుళూరు
సాధారణంగా హార్మోన్ సమతుల్యత దెబ్బతినడం వల్ల పెళ్లయిన తరువాత ఇలాంటి సమస్య కనిపిస్తుంది. పెళ్లయిన తరువాత కలయిక వల్ల గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)లో ఇన్‌ఫెక్షన్లు రావడ సహజం. పదే పదే ఇన్‌ఫెక్షన్లు వచ్చి ఆ భాగంలో ఒరుసుకుపోయినట్టుగా అవ్వొచ్చు. గైనకాలజిస్టు పరీక్షచేస్తే ఇది తెలిసిపోతుంది. నెలసరి ముందు గర్భసంచి ముఖద్వారం వైపు రక్తప్రసరణ ఎక్కువ కావడం చేత ఇలాంటిది కనిపించవచ్చు. కొన్నిసార్లు సర్విక్స్‌లో చిన్న చిన్న పాలిప్స్ ఏర్పడవచ్చు. వీటివల్ల కూడా ఇలా నెలసరి ముందు కొంచెం రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. ఇకపోతే పెళ్లయిన కొత్తలో అమ్మాయికి శారీరకంగా గాని, మానసికంగా గాని రకరకాల ఒత్తిళ్లు కలుగుతాయి. అంతేగాక ఎక్కువగా ఫంక్షన్లకు వెళ్లాల్సి రావడం, బయట తినడం వల్ల బరువు పెరుగుతారు.
ఈ స్ట్రెస్, బరువు పెరగడం ఏ కారణం వల్లనైనా హార్మోన్లలో తేడాలు వస్తాయి. దీనివల్ల కూడా ఇలాంటి సమస్య పెళ్లవగానే కనిపిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు సర్విక్స్ భాగాన్ని పరీక్ష చేయడం ద్వారా దాదాపుగా సమస్య ఏంటో తెలిసిపోతుంది. తదనుగుణంగా చికిత్స తీసుకుంటే సరిపోతుంది. హార్మోన్ల అసమతుల్యతకు కూడా చికిత్స ఉంది. అయితే మీ పెళ్లయిన ఇన్నేళ్లలో మీకేమైనా సమస్యలు వచ్చాయేమో మీరు చెప్పలేదు. మరో విషయం ఏంటంటే మెనోపాజ్ ప్రారంభం అవుతుందనడానికి అయిదేళ్ల ముందు నుంచి కూడా ఇలాంటి సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్టును కలవండి.
0 comments:
Post a Comment