మన శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. ఇది సుమారు 300 రకాల జీవ రసాయనిక చర్యల్లో పాలుపంచుకుంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో దీన్నిబట్టే అర్థమవుతుంది. మన శరీరంలోని మెగ్నీషియంలో సగం వరకు ఎముకల్లోనే ఉంటుంది. మిగతాది కణాల లోపల, కణజాలంలో, అవయవాల్లో ఉంటాయి. కండరాలు, నాడుల పనితీరు సక్రమంగా జరగాలంటే ఈ మెగ్నీషియం ఎక్కువగా తోడ్పడుతుంది. ఇది పక్షవాతం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం ద్వారా వచ్చే పక్షవాతం ముప్పూ తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియంలో అదనంగా 100 మిల్లీగ్రాముల మోతాదు పెరుగుతున్నకొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్టు కనుగొన్నారు.
పొట్టు తీయని ధాన్యాలు.. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరగాయలు (బీన్స్), బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కప్పు బీన్స్ లేదా ముడి బియ్యం, 30 గ్రాముల బాదం లేదా జీడిపప్పు, కప్పు ఉడికించిన పాలకూర తింటే సుమారు 100 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకూ దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినటం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండా చూసుకోవచ్చు.
0 comments:
Post a Comment