అంబర్‌పేట : బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన రచ్చ శ్రీనివాస్ కుమారుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. రోజులు గడిచినా జ్వరం తగ్గకపోగా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. ఓ రక్తనిధి కేంద్రం పర్యవేక్షణలో రక్తదాత సాయంతో(సింగిల్ డోనర్) నేరుగా రక్తకణాలు సేకరించే ప్రక్రియను చేపట్టగా గంటల వ్యవధిలో రూ.25వేలకు పైగా ఖర్చు భరించాల్సి వచ్చింది.
* హైకోర్టు న్యాయవాది కూతురు ఒకరికి డెంగీ వస్తే ఆమెను బర్కత్‌పురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయని చెప్పి బెదరగొట్టారు. రూ.70వేల ఖర్చు అవుతుందన్నారు. ప్లేట్‌లెట్స్ గల రక్తం దొరకడం కష్టమని చెప్పారు.
ఇది ఒక్క శ్రీనివాస్, న్యాయవాది సమస్యే కాదు. ఇంలా రక్తకణాలు పడిపోయి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య వందల్లో ఉంటోంది. ప్రస్తుత సీజన్‌లో జ్వరాలు.. ఒత్తిళ్లతో కూడిన జీవనశైలి ఇలా ఎన్నో కారణాలతో మనిషి శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతున్నాయి. ఏటా వర్షాకాలం సీజన్‌లో ప్రజలను వణికిస్తున్న రక్త ఫలకాల సమస్య జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. జ్వరాల బారిన పడి దవాఖానల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అదే సమయంలో నగరంలో ఉన్న రక్తనిధి కేంద్రాల్లో అవసరమైన రక్త ఫలకాలు(ప్లేట్‌లెట్స్) దొరకని పరిస్థితి నెలకొంది. కొన్ని రక్తనిధి కేంద్రాలు రోగుల అవసరాన్ని బట్టి రూ.వేలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్త ఫలకాలు, ఆరోగ్యంలో వాటి ప్రాధాన్యం, సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.
కణాలు ఎక్కడ తయారవుతాయంటే..
మనిషి రక్తంలో ఉండే ఎర్ర, తెల్ల రక్త కణాలు అన్ని ఎముకల్లో మూలుగ నుంచి ఉత్పత్తి అవుతాయి. మూలుగపై ప్రభావం చూపే వ్యాధులు సోకిన సమయంలో కణాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
తెల్ల రక్త కణాలు కీలకమే..
మూలుగలో ఉత్పత్తయిన 7 నుంచి 30 రోజు ల పాటు తెల్లరక్త కణాలు జీవించి ఉం టాయి. రక్తంలో వీటి సంఖ్య తగ్గితే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో ఎలాంటి వ్యాధు లు ముసిరినా.. అవి అదుపులోకి రావడానికి చాలా సమయం పడుతుంది.
ప్లేట్‌లెట్స్ ఎందుకు తగ్గుతాయి..?
* ఎముకల్లోని మూలుగపై తీవ్ర ప్రభావం చూపే మందులు వాడినప్పుడు.
* వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన సమయంలో...
* ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌తో
* హెచ్‌ఐవీ, పర్వోవైరస్, డెంగీ, హైపటైటిస్-సి, సైటోమోగలో వైరస్ సంక్రమించినప్పుడు
* క్యాన్సర్ చికిత్స కీమో థెరఫీ వల్ల..
* మద్యం దురలవాటుతో
ప్లేట్‌లెట్స్ పెరగాలంటే..
* బొప్పాయి ఆకు, గోధుమ నారు నుంచి తీసే రసం గ్లాసు తాగాలి.
* బీట్‌రూట్, కలబంద రసం తీసుకోవాలి.
* జామ(ఎర్ర) కాయలు తినాలి.
* విటమిన్ సి, కె లభించే పండ్లు, ఆహార పదార్థాలు, గుమ్మడి కాయలు తీసుకోవాలి. ముఖ్యంగా అడవి ఉసిరి మేలు చేస్తుంది.
* నీళ్లు సరిపడా తీసుకోవాలి.
* పై జాగ్రత్తలకు తోడు సరైన నిద్ర, వ్యాయామం కూడా ఎంతో అవసరం.
లక్షణాలు
శరీరంపై ఎర్రని మచ్చలు, లాలాజలంలో రక్తం కనిపించడం, ముక్కు నుంచి రక్తం కారడం, మూత్రం ఎరుపు రంగులో రావడం, విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, విరోచనం నలుపుగా ఉండటం, శరీరం నిస్సత్తువగా మారడం వంటివి జరుగుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తంలోని ఎరుపు, తెలుపు రక్తకణాలు కాకుం డా కేవలం ప్లేట్‌లెట్‌లను రోగికి ఎక్కించాల్సి ఉంటుంది.
* రక్తపోటు, చక్కెర వ్యాధులకు, గుండె జబ్బులకు మందులు వాడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* దంతదావనం చేసేటప్పుడు రక్తస్రావం జరగకుండా చూసుకోవాలి.
* మద్యపానం మానేయాలి.
* మహిళలు నెలసరి సమయంలో జాగ్రత్త వహించి వైద్యులను సంప్రదించాలి. కామెర్లు, మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి ప్రమాదం.
20 వేల కన్నా తగ్గొద్దు
ప్లేట్‌లెట్‌లు రక్తాన్ని గడ్డకట్టిస్తాయి. శరీరానికి గాయమైనప్పుడు వెంటనే రక్తం గడ్డకట్టుకుపోతే తీవ్ర రక్తస్రావం జరగదు. రక్త ఫలకాల సంఖ్య 50 వేల కంటే తగ్గకూడదు. మరీ 20వేల కంటే తగ్గితే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ స్థాయిలో దెబ్బతగలకున్నా శరీర రంధ్రాల నుంచి రక్తం కారే అవకాశం ఉంది.
No comments:
Post a Comment