ఆ వంటింట్లో ఏముంటుందీ.... నోరూరించే వంటలు... వంటలకు పనికొచ్చే దినుసులు అనుకుంటాం. కానీ వంటిల్లు హాస్పిటల్‌తో సమానం. వంటింట్లో ఉండే ప్రతీ పదార్థం మన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
జీర్ణాశయ సమస్యలకు అల్లం బాగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెట్టి ఆరోగ్యాన్ని కాపాడడంలో అల్లాన్ని మించిన ఔషధం లేదనేది ప్రకృతి వైద్యుల మాట.
పైత్యాన్ని తగ్గించడంలో అల్లం బెస్ట్ మెడిసిన్. గర్భవతులను ఉదయం పూట ఇబ్బంది పెట్టే వికారానికి చెక్ పెట్టాలంటే.. అల్లం మెత్తగా దంచి అందులో చక్కెర కానీ, బెల్లం కానీ కలిపి ఇవ్వాలి. కీమోథెరపీ వల్ల వచ్చే కడుపునొప్పిని కూడా అల్లం తగ్గిస్తుంది.
షుగర్‌ని తగ్గించే దాల్చిన చెక్క :
ప్రొటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి లాంటి ఎన్నో పోషక విలువలకు దాల్చిన చెక్క కేరాఫ్ అడ్రస్. దాల్చినచెక్కలో ఉండే ఔషధ విలువలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయి మీద ప్రభావం చూపుతూ కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్‌ల స్థాయిని తగ్గించడంలో చెక్క బాగా పనిచేస్తుంది. జలుబు వల్ల వచ్చే తలనొప్పి తగ్గేందుకు దాల్చినచెక్క మెత్తగా నూరి నుదురకు పట్టిస్తే తలనొప్పి మాయం. గుండె పట్టేసినట్టుగా అనిపించినప్పుడు దాల్చినచెక్క చూర్ణం, యాలకుల పొడిని సమపాళ్లలో నీటిలో కలుపుకొని కషాయంలా మరిగించి తాగితే ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి వైద్యం :
పచ్చివెల్లుల్లి తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పుల్ని తగ్గిస్తాయి.
ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ జ్వరం, కొవ్వు, షుగర్, ఆర్థరైటిస్, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లి మంచి ఔషధం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద ఔషధాలలో వెల్లుల్లిని విరివిగా వాడతారు. విటమిన్-సి, బి6, సెలీనియమ్, జింక్, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి.
కుంకుమపువ్వుతో అందం :
రంగు, రుచి, సువాసన కోసం వాడే కుంకుమపువ్వు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో ఖరీదైన కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు అధికంగా ఉంటాయి.
గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమపువ్వు తింటే పండంటి బిడ్డ పుడతాడు. కాకపోతే మోతాదు మించితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కుంకుమపువ్వులో జ్ఞాపకశక్తిని పెంచే లక్షణాలున్నాయి. క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆస్తమా చికిత్సలో కూడా కుంకుమపువ్వును ఔషధంగా వాడతారు.
జీర్ణశక్తికి జీలకర్ర :
ఇందులో ఉండే క్యూమిక్, డీహైర్ అనే పదార్థాలు జీర్ణశక్తిని పెంచి, లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి.
కడుపునొప్పి, మలబద్దకం, వాంతి, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ వంటి ఆరోగ్య సమస్యలకు జీలకర్ర మంచి మoదు. దీన్ని బాగా వేయించి కొద్దిగా ఉప్పు జోడించి తినాలి. జీలకర్రలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు జలుబు, జ్వరాలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి బాగా మరిగించిన నీటిని తాగితే జలుబు వెంటనే తగ్గుముఖం పడుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు రెగ్యులర్‌గా జీలకర్ర తీసుకుంటే పరిస్థితిలో మార్పు వస్తుంది.